ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. చంచల్‌గూడలో స్పోర్ట్స్ మీట్‌ను డీజీపీ ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. 28 విభాగాల్లో క్రీడలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో 193 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 2 రోజుల పాటు క్రీడా పోటీలు జరుగుతాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగానే స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తీర్చిదిద్దడంలో జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది పాత్ర మరవలేనిదని డీజీపీ కొనియాడారు. ప్రతి వ్యక్తి శారీరకంగా దృఢంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. క్రీడల్లో రాణించాలంటే పట్టుదల, కృషి చాలా ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జైళ్లశాఖ సిబ్బంది పోలీస్ శాఖకు ఆదర్శంగా ఉండాలని ఆయన సూచించారు. సమాజ సేవకు జైళ్ల శాఖ చేస్తున్న కార్యక్రమాలు మరవలేనివని ఆయన అన్నారు.
ఆటగాళ్లకు క్రీడా స్ఫూర్తి చాలా ముఖ్యం: డీజీపీ